Friday, July 17, 2026
Homeతెలంగాణదేవరకొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

దేవరకొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

📰 Generate e-Paper Clip

దేవరకొండ,జూలై 17(చైతన్యగళం):
దేవరకొండలో సంచలనం సృష్టించిన బస్టాండ్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బ్లేడ్లతో బ్యాగులు, కవర్లు కోసి నగదు దోచుకునే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ నెల ఒకటో తేదీన దేవరకొండ కొత్త బస్టాండ్‌లో మండల లక్ష్మమ్మ అనే మహిళ చేతిలో ఉన్న కవర్‌ను బ్లేడుతో కట్ చేసి రూ.2 లక్షల నగదును దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో కొత్త బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఏపీ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన అన్నారెడ్డి ఈశ్వరి, కావడి అంజమ్మ, ఆటో డ్రైవర్ కటారి రవిచందర్‌లుగా గుర్తించారు. మరో నిందితుడు అన్నారెడ్డి మధు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితురాలు ఏ1 అన్నారెడ్డి ఈశ్వరి (భర్త: మధు)పై ఇప్పటికే 10 కేసులు, ఏ2 కావడి అంజమ్మ (భర్త: ప్రసాద్)పై 40 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. వీరంతా 2015 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీని లక్ష్యంగా చేసుకుని బ్లేడ్లతో బ్యాగులు కట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది..
నిందితుల నుంచి దొంగతనాలకు ఉపయోగించిన ఏపి39-యూవి-6724 నంబర్ గల పసుపు రంగు ఆటో, మూడు స్మార్ట్‌ఫోన్లు, రూ.12 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును వేగంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్‌ఐలు రాజ్ నారాయణ రెడ్డి, ప్రకాష్ రెడ్డి మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!