Monday, August 24, 2026
Homeసంపాదకీయంఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది.

మెల్‌బోర్న్, జులై 8(చైతన్యగళం): మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (బుధవారం) ఆస్ట్రేలియా చేరుకున్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది.

ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ.. మోదీ’ నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు హోరెత్తాయి. ‘ఆస్ట్రేలియన్ ఇండియన్ ఆర్కెస్ట్రా’ అందించిన వందేమాతరం ఆలాపన ఈ స్వాగత వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియా వచ్చిన ప్రధాని మోదీ, ఈ పర్యటన అనంతరం న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరగబోయే ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘X’ లో స్పందిస్తూ… ‘ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో చర్చల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల బంధానికి బలమైన స్తంభాలుగా నిలుస్తున్న ప్రవాస భారతీయులతో ముచ్చటించే అవకాశం కూడా ఈ పర్యటనలో నాకు లభించనుంది.’ అన్నారు.

ఈ ఉన్నత స్థాయి భేటీలో ఇరు దేశాల ప్రధానమంత్రులు రక్షణ-భద్రత, వ్యాపారం-పెట్టుబడులు, విద్య, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో పాటు అభివృద్ధి చెందుతున్న కీలక సాంకేతికతలు, క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.

జోరుగా సాగుతున్న వాణిజ్యం.. 2030 నాటికి $100 బిలియన్ల లక్ష్యం!

భారత్-ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు గతంతో పోలిస్తే విపరీతంగా పుంజుకున్నాయి. ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ విక్టోరియా ట్రెజరర్ ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఒకప్పుడు కేవలం 14 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యాపారం, ప్రస్తుతం 55 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రాబోయే 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి.

మారుతోన్న ప్రపంచ స్థితిగతుల నేపథ్యంలో భారత్‌కు అవసరమైన ‘యురేనియం’ను ఆస్ట్రేలియా సరఫరా చేయగలదని, అలాగే ఆస్ట్రేలియాకు ఎంతో అవసరమైన ప్రొఫెషనల్ ఐటీ (IT) నిపుణులను భారత్ అందించగలదని, దీనివల్ల ఇరు దేశాల వ్యాపారాలు మరింత విస్తరిస్తాయని ప్రవాస భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మెల్‌బోర్న్‌లో మోదీ వైబ్స్.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఉత్సాహం

భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మెల్‌బోర్న్ నుంచి ‘X’ లో ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ప్రధాని మోదీ రాకతో మెల్‌బోర్న్ నగరం మొత్తం ఒక సరికొత్త ఉత్సాహంతో ఊగిపోతోందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మొదటి దశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, ఈ పర్యటనతో వాణిజ్య బంధం మరింత పటిష్ఠం కానుందని ఆయన తెలిపారు. అలాగే సంస్కృతికి నిలయమైన మెల్‌బోర్న్ నగరంలో భారత్‌తో కలిసి కళలు, సాంస్కృతిక రంగాలలో మరిన్ని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రీన్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!