రంగారెడ్డి , జూలై 08 (చైతన్యగళం): భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న *డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (AgriStack)*లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ – ప్రతి అర్హత కలిగిన రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని ప్రత్యేక యూనిక్ ఫార్మర్ ఐడీ పొందాలని సూచించారు. గ్రామాల వారీగా ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించి రైతుల ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పట్టాదార్ పాస్‌బుక్ వివరాలను సేకరించి బయోమెట్రిక్ లేదా ఓటీపీ ధృవీకరణ ద్వారా నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, పెట్టుబడి సహాయం, పంటల బీమా, సబ్సిడీలు, బ్యాంకు రుణాలు అన్నీ ఫార్మర్ ఐడీ ఆధారంగా అందించే విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. పీఎం-కిసాన్ సహా ఇతర పథకాల ఆర్థిక సహాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు బీమా పరిహారం త్వరితగతిన అందుతుందని, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీలు పొందడంలో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
