సిద్దిపేట, జూలై 6 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కేఎస్ఆర్ గార్డెన్స్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, 1.30 లక్షల గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 80 వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు కుల, మత భేదాలు లేకుండా నాలుగు విడతల్లో ఇళ్లు అందజేస్తామని, లబ్ధిదారులకు ఉచిత ఇసుకతో పాటు నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, త్వరలో కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
