Saturday, September 5, 2026
Homeసంపాదకీయంప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, ఆగస్టు 15{చైతన్యగళం}:
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ పెరేడ్‌ను మంత్రి పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన, పారదర్శక పాలనతో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు ప్రజలకు చేరవేసేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో రైతుభరోసా పథకం కింద 3.25 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.1,476 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. రైతుబీమా కింద 3,104 రైతు కుటుంబాలకు రూ.155 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో, తక్కువ కాలంలో పూర్తయ్యే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. జిల్లాలో మధ్య మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు అదనపు నీటి పనులను రూ.14,402 కోట్లతో చేపట్టామని, గౌరవెల్లి జలాశయం ప్రధాన కాలువల పనులు 56 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గౌరవెల్లి–గండిపల్లి ఎత్తిపోతల పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ చేయూత పింఛన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. జిల్లాలో 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 48,838 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఉచిత సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 11,839 ఇళ్లు మంజూరు కాగా, 10,754 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇందుకోసం రూ.255.20 కోట్ల నిధులు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి రెండో దశలో మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, మహిళా సంక్షేమం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. తాజాగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. యువత నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఏటీసీ మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!