Saturday, August 15, 2026
Homeతెలంగాణసిద్ధిపేటసిద్దిపేటలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

సిద్దిపేటలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, ఆగస్టు 15(చైతన్యగళం):
సిద్దిపేట పట్టణంలోని వైశ్య కన్వెన్షన్ భవన్‌లో లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, జిల్లా లైబ్రరీ చైర్మన్ ధరిపల్లి చంద్రం, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య, ఆర్డీవోలు, ఆర్టీఏ సభ్యుడు సూర్యవర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా తమకు రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడ్డామని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. రేషన్ కార్డు రావడంతో ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పొందుతున్నామని, తమకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు: మంత్రి పొన్నం ప్రభాకర్


మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా, సిద్దిపేటలో తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతంలో కొత్తగా వివాహమైన కుటుంబాలకు రేషన్ కార్డులు పొందే పరిస్థితి లేకపోయిందని, ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్తగా 16 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసిందని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా 365 రోజులు కొనసాగుతుందని చెప్పారు.రేషన్ కార్డులతో పాటు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మండలాలు, గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సర్పంచులు, అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కోటి 6 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 3.60 కోట్ల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి కొత్త పింఛన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, వికలాంగులు, వితంతు మహిళలు తదితర అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో మొదటి దశలో 3,500, రెండో దశలో 2,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 70 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, తాజాగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. మంచి వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ కొండగట్టు చుట్టూ గిరిప్రదక్షిణ చేశామని, బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారని చెప్పారు. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నక్షత్రమాల సమర్పించామని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళలకు బస్సుల యాజమాన్య అవకాశాలు కల్పిస్తున్నామని, పెట్రోల్ బంకులు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, ధరించేందుకు అనుకూలంగా ఉండేలా నాణ్యమైన చీరలను ప్రభుత్వం అందిస్తోందని మంత్రి తెలిపారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ కె. హైమావతి


జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ వంటి ఆరు గ్యారంటీ పథకాలతో పాటు ఇందిరమ్మ చీరలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందన్నారు. పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!