మంచిర్యాల(చైతన్యగళం): 2026–27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గ్రూపులలో ఖాళీల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు సమన్వయకర్త రామ కళ్యాణి తెలిపారు. జిల్లాలోని బాలురకు జైపూర్, బాలికలకు లక్షెట్టిపేటలోని గురుకుల జూనియర్ కళాశాలలో జూలై 6న ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ జరుగనుంది. అర్హత కలిగిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, నకలు ప్రతులతో హాజరుకావాలని సూచించారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రిజిస్ట్రేషన్, మధ్యాహ్నం 1 గంటకు మెరిట్ జాబితా, 2 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. ఎస్‌ఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెరిట్, కుల ప్రాతిపదికన అడ్మిషన్లు కల్పిస్తారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.5 లక్షలు లోపు ఉండాలని, తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు.అడ్మిషన్ పొందిన విద్యార్థులు మరుసటి రోజు కళాశాలలో చేరాలని, జూలై 10లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించని యెడల అడ్మిషన్ రద్దు అవుతుందని పేర్కొన్నారు.
