- పాల్గొన్న మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి
హుస్నాబాద్ , జూలై 10 (చైతన్యగళం): హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మొదటి విద్యా సంవత్సరం పూర్తయ్యి రెండో సంవత్సరం ప్రారంభమయ్యేలోపు శాశ్వత భవనాల నిర్మాణానికి భూమిపూజ చేయడం సంతోషకరమన్నారు. కాంట్రాక్టర్ ఏడాది లోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణానికి రూ.15 కోట్లతో యూనివర్సిటీ పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని, త్వరలోనే వాటికి కూడా శంకుస్థాపన నిర్వహిస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించామని, రెండో సంవత్సరం నుంచి మరింత మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి ప్రియాంక గాంధీ మెడికల్ కళాశాల హామీతో పాటు పీజీ మెడికల్ కళాశాల కూడా మంజూరైందని తెలిపారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైకిళ్లు అందజేస్తూ ఇతర ఇంజినీరింగ్ కళాశాలలకు సమానమైన సౌకర్యాలను శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో కల్పిస్తున్నామని చెప్పారు.
ఇటీవల ఏటీసీ (ATC)కి కూడా శంకుస్థాపన చేసినట్లు పేర్కొంటూ, అక్కడ టెక్నికల్ కోర్సులు పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. గత పదేళ్లలో ఒక్క కొత్త కోర్సు కూడా రాకపోయినా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజినీరింగ్, లా, ఫార్మసీ కళాశాలలను మంజూరు చేసి ఉన్నత విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
