హుజూరాబాద్, జూలై 10 (చైతన్య గళం):
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సకాలంలో అందడం లేదని, సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
ఆసుపత్రిలో 12 మంది సిబ్బంది మంజూరై ఉన్నప్పటికీ, వారిలో 6 మంది డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం ఒక్క వైద్యుడితోనే ఆసుపత్రి నడుస్తోందని గుర్తించారు. దీంతో ప్రజలకు అవసరమైన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వైద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, డిప్యూటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని వెంటనే తిరిగి విధుల్లోకి రప్పించి, ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో చల్లూరు పిహెచ్‌సీ ప్రసవాల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి మూడు సార్లు అవార్డులు సాధించిందని గుర్తుచేసి, అలాంటి ఆసుపత్రి నేడు నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని అన్నారు.
వారం రోజుల్లో మరోసారి ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శిస్తానని, అప్పటిలోపు సిబ్బంది హాజరు, పరిశుభ్రత, రోగులకు అందించే సేవల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించాలని అధికారులను హెచ్చరించారు. పేద, నిరుపేద కుటుంబాల ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి సిబ్బంది బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలకిషన్ రావు, వీణవంక మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, చల్లూరు సర్పంచ్ రామిడి సంపత్ రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
