వెల్డండ, జూన్ 29 (చైతన్యగళం): చేర్కూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ప్రతి అర్హుడైన పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలి. తప్పులు సరిచేసుకోవడం, కొత్తగా అర్హత పొందిన వారు పేర్లు నమోదు చేసుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, వివరాల్లో మార్పులు చేయడం వంటి అంశాలపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి” అని సూచించారు.
వార్డు సభ్యులు బూత్ స్థాయిలో ప్రజలకు సహకరిస్తూ, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు అధికారులకు అవసరమైన వివరాలు అందించి, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండలు, వార్డు సభ్యుడు పురుగుల రమేష్, కుమారస్వామి, జిపిఓ ఆంజనేయులు, బుజ్జయ్య, జంగయ్య, రామకృష్ణ, సందీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
