సైదాపూర్, జూన్ 29 {చైతన్యగళం}
నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల నమోదు లేక మూతపడిన గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం తిరిగి ప్రారంభమైంది. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషితో పాఠశాల మళ్లీ పిల్లల కేరింతలతో కళకళలాడింది.
పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి వెన్నెముకలాంటివని, గ్రామస్థుల సహకారంతో మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభించడం ఆదర్శప్రాయమని ఆయన అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో సుమారు 20 మంది విద్యార్థులు చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక ఆధారిత బోధన అందుబాటులో ఉన్నాయని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దోకిడి తిరుపతి మాట్లాడుతూ, తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని, ఈ బడి తమ జీవితానికి బలమైన పునాది వేసిందన్నారు. నాలుగేళ్ల తర్వాత పాఠశాల తిరిగి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. పాఠశాల పునఃప్రారంభానికి కృషి చేసిన జిల్లా విద్యాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి, మండల విద్యాధికారి కట్టా రవీంద్ర చారి, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
అనంతరం మండల విద్యాధికారి కట్టా రవీంద్ర చారి గ్రామ సర్పంచ్ మాచమల్ల శ్రీకాంత్, ఉపసర్పంచ్ కౌడగాని వీరేశం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి మిల్కూరి శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జై గోపాల్ సింగ్, దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి రాజీవ్, వీవో మహిళా బెల్లి రజిత, అంగన్‌వాడీ టీచర్ అమరగొండ పద్మ, మాజీ ఉపసర్పంచ్ దాసరి రవీందర్, వార్డు సభ్యులు, సీఆర్పీలు రమేష్, చక్రపాణి, శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
