- తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి సమగ్రంగా పరిశీలించాలి: పోగుల సైదులు గౌడ్
నల్లగొండ, నవంబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ పలువురు అర్హులైన పేదలకు న్యాయం జరగకపోవడం విచారకరమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్ అన్నారు. చిన్నచిన్న కారణాలను సాకుగా చూపుతూ పేదల పింఛను దరఖాస్తులను తిరస్కరించడం ప్రభుత్వ సంక్షేమ లక్ష్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
2023 ఎన్నికల మేనిఫెస్టోలోని 34వ పేజీ, 24వ అంశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం చిన్నపాటి స్థలం ఉందనో, కుటుంబ సభ్యులు అద్దె వాహనాలు కొనుగోలు చేశారనో, ఇతర సాంకేతిక కారణాలనో చూపుతూ అర్హులైన నిరుపేదలకు పింఛన్లు నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పింఛను అనేది పేదలకు ప్రభుత్వం చేసే ఉపకారం కాదని, వారి జీవన గౌరవానికి, ఆర్థిక భరోసాకు కల్పించాల్సిన హక్కు అని అన్నారు.
తిరస్కరించిన దరఖాస్తులన్నింటినీ మానవీయ కోణంలో మరోసారి సమగ్రంగా పరిశీలించి, నిజమైన అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పింఛన్లకు అర్హత లేనివారికి కూడా అధికార పార్టీ కార్యకర్తలుగా ఉన్న కారణంగా స్థానిక నాయకుల సిఫారసులతో పింఛన్లు మంజూరు చేస్తూ, నిజమైన పేదలకు అన్యాయం చేయడం సరికాదని విమర్శించారు.
బడుగు, బలహీన వర్గాల కుటుంబాల ఇబ్బందులను, వృద్ధుల ఆకలి బాధలను, ఉపాధి కోల్పోయిన వారి దీనస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కాదని, అర్హులైన పేదలకు న్యాయం జరగాలనే ప్రజాస్వామ్య డిమాండ్ అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని దరఖాస్తులను పునఃపరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందేలా న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని పోగుల సైదులు గౌడ్ కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

