- కార్తీక మాసంలో పనులకు శంకుస్థాపన చేయాలి.. నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, నవంబర్ 4 (చైతన్యగళం):
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో దేవాదాయ శాఖ రాష్ట్రస్థాయి అధికారులతో ఆలయాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం, హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, పొట్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి చేపట్టాల్సిన నిర్మాణ పనులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.3.80 కోట్లు, హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి రూ.80 లక్షలు, పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులపై మంత్రి సమీక్షించారు.
ఆలయాల నిర్మాణాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ స్థపతి, ఇతర అధికారులు, పండితులు, నిపుణులతో నిర్మాణ ప్రణాళికలు, అభివృద్ధి పనులపై చర్చించారు. మూడు ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులకు కార్తీక మాసంలో శంకుస్థాపన చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ గర్భగుడిని రాతి కట్టడంగా నిర్మించాలని, పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు.
నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా కొనసాగించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లి నాయగం, దేవాదాయ శాఖ డీఈ ఓం ప్రకాష్, ఈవో కిషన్‌రెడ్డి, పండితులు వినయ్ శర్మ, సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
