- మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలి: టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి
హుస్నాబాద్, నవంబర్ 4 (చైతన్యగళం):
మణుగూరు డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవళిక మృతికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలని టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి డిమాండ్ చేశారు. ఆమె మృతిపట్ల టీఎంయూ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేస్తోందని తెలిపారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ, వారి కష్టానికి తగిన గుర్తింపు, భద్రత లభించడం లేదని ఎంపీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల భద్రతను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బస్సుల్లో అధిక రద్దీ కారణంగా కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణికుల ఒత్తిడి, నిలబడేందుకు కూడా సరిపడా స్థలం లేకపోవడం, తగిన భద్రతా చర్యలు లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. ప్రవళిక మృతికి బస్సుల్లో అధిక రద్దీ కూడా కారణమై ఉండవచ్చని పేర్కొంటూ, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మృతురాలి కుటుంబానికి వెంటనే కోటి రూపాయల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రద్దీ ప్రాంతాలు, సమయాల్లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, బస్సుల్లో అధిక రద్దీని నియంత్రించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టి, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రవళిక మృతికి కారకులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రవళిక మృతి కేవలం ప్రమాదంగా చూడరాదని, కార్మికుల భద్రత పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, లేనిపక్షంలో టీఎంయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
