- లింగన్నపేటలో కనులపండువగా వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల కోలాటాలు, భక్తి గీతాలు
గంభీరావుపేట, అక్టోబర్ 27 (చైతన్యగళం): సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య సాగిన ఉత్సవంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
ఉత్సవంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కోలాటాలు, ఆలపించిన భక్తి గీతాలు, సంప్రదాయ కళారూపాలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది.
భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో గ్రామస్థులు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అమీద్, వైస్ చైర్మన్ భాస్కర్, ఆలయ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ సురేష్, వేద పండితులు రాధాకృష్ణశర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

