Tuesday, October 27, 2026
Homeతెలంగాణమహబూబ్‌నగర్మక్తల్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌.. 43 వాహనాల స్వాధీనం!

మక్తల్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌.. 43 వాహనాల స్వాధీనం!

📰 Generate e-Paper Clip

  • నేరాల నియంత్రణే లక్ష్యం.. అనుమానాస్పద వాహనాలపై తనిఖీలు

మక్తల్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌, ఎల్లమ్మకుంట ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వినీత్‌ ఆదేశాల మేరకు మక్తల్‌ సీఐ రాంలాల్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలు సహా మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను పోలీసులు పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, నంబరు ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సరైన పత్రాలు సమర్పించిన వాహనాలను విడిచిపెట్టగా, మిగిలిన వాహనాలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

మక్తల్‌, మాగనూరు, కృష్ణ, మరికల్‌ పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఎస్‌ఐలు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోకి కొత్త వ్యక్తులు, వాహనాల రాకపోకలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సీఐ సూచించారు. ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలయ్యే ముప్పు తగ్గుతుందని వివరించారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా నేరాల వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని సూచించారు. కుటుంబంలో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైనట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారికి అవసరమైన చికిత్స అందించేందుకు సహకరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రాజు, నవీద్‌, రమేష్‌, మహేంద్రరెడ్డి, రేవతి, ఏఎస్ఐ శంకరయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!