- నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
- అధికారులకు ఎన్నికల రోల్ అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్ హెచ్చరిక
నందికొట్కూరు, అక్టోబర్ 10(చైతన్యగళం):
నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎస్‌ఐఆర్–2026 ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల రోల్ అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్ శనివారం సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆరు మండలాలకు చెందిన ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, ఇప్పటికే నమోదైన వివరాల సవరణకు సంబంధించి ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజాప్రాతినిధ్య చట్టం–1950, ఓటరు నమోదు నిబంధనలు–1960తో పాటు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల మార్పులకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అవసరమైన ధ్రువీకరణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అందిన దరఖాస్తులను నిర్ణీత విధానంలో పరిష్కరించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వహించినా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా లేదా విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ అధికారులు తమ విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఈఆర్‌ఓ సి. వెంకట శివ, ఆత్మకూరు ఆర్డీఓ, ఏఈఆర్‌ఓలు బి. శ్రీనివాసులు, చంద్రశేఖర్ నాయక్, శివరాముడు, పగిడ్యాల శ్రీనివాసులు, సుభద్ర, పాములపాడు ఉమారాణి, ఎన్నికల పర్యవేక్షకులు, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
