Saturday, October 10, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రజాసేవకు అవకాశం కల్పిస్తే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా!

ప్రజాసేవకు అవకాశం కల్పిస్తే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా!

📰 Generate e-Paper Clip

  • చైర్మన్‌ పోటీకి సిద్ధమంటున్న జనసేన సీనియర్‌ నాయకుడు మాసమ్‌ సాహెబ్‌

నందికొట్కూరు, అక్టోబర్ 10(చైతన్యగళం):

జనసేన పార్టీ తనకు మున్సిపల్‌ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, బీసీ వర్గానికి చెందిన మాసమ్‌ సాహెబ్‌ తెలిపారు. ప్రజాసేవకు అవకాశం లభిస్తే పట్టణంలోని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న తాను, ప్రస్తుతం జనసేన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని తెలిపారు. 2024 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కూటమి విజయానికి విశేషంగా శ్రమించారని గుర్తుచేశారు.

పార్టీ విజయానికి కష్టపడిన జనసైనికులకు నామినేటెడ్‌ పదవులతోపాటు స్థానిక సంస్థల్లోనూ తగిన గుర్తింపు కల్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తే కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.

మున్సిపల్‌ చైర్మన్‌గా అవకాశం లభిస్తే జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు.

చైర్మన్‌గా తనకు లభించే వేతనంలో సగభాగాన్ని పదవిలో ఉన్నంతకాలం పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. కులమతాలు, రాజకీయ భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో ప్రజాసేవను చూపిస్తానని తెలిపారు.

జనసేన పార్టీ తనకు అవకాశం కల్పిస్తే నందికొట్కూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని మాసమ్‌ సాహెబ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!