Sunday, November 22, 2026
Homeతెలంగాణప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూముల వినియోగం

ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూముల వినియోగం

📰 Generate e-Paper Clip

  • జంగిలిగొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు.. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ – ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీ నాయక్‌

మహబూబాబాద్‌, నవంబర్‌ 21 (చైతన్యగళం):

జంగిలిగొండ గ్రామంలోని ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించే బాధ్యత తనదేనని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీ నాయక్‌ స్పష్టం చేశారు. గ్రామంలో గుర్తించిన ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని, ఇందుకోసం జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడతామని తెలిపారు.

మహబూబాబాద్‌ మండలం జంగిలిగొండ గ్రామంలో పైలట్‌ కార్యక్రమంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌ గుండెల రేణుక అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, వాటిని ఆక్రమణలకు గురికాకుండా కాపాడి గ్రామ ప్రజల ఉమ్మడి అవసరాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలు వైద్య సేవల కోసం మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని, ఈ ఇబ్బందులను తొలగించేందుకు జంగిలిగొండలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ భూమిని వినియోగించడంతో పాటు నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించి ముందుకు వెళ్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ లభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. రేషన్‌ కార్డు ఉన్నవారితో పాటు, రేషన్‌ కార్డు లేని అర్హులైన కుటుంబాలకు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకుని ఆర్థిక భరోసా పొందాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

అనంతరం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో భాగంగా గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అర్హులందరికీ పథకం ప్రయోజనాలు అందేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, ఎంపీడీవో రఘుపతిరెడ్డి, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాల చీఫ్‌ అడ్వైజర్‌ దేవరం ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్‌ గుండెల రేణుక, ఉపసర్పంచ్‌ కొయ్యల అనిల్‌, వార్డు సభ్యుడు బోయిని వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి గూగులోత్‌ రాములు, శశి, సుమలత, వీవో అధ్యక్షురాలు గోల్కొండ శ్రీదేవి, సీఏ గోల్కొండ స్రవంతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!