- వర్తక వాణిజ్య కమిటీ వైస్ చైర్మన్‌గా మాలె నాగేశ్వరరావు, పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్‌గా తల్లాడి విజయ్‌కుమార్
మహబూబాబాద్, నవంబర్ 21 (చైతన్యగళం):
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన రాష్ట్ర కమిటీలో మహబూబాబాద్ జిల్లాకు సముచిత ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర స్థాయిలో కీలకమైన రెండు పదవులు మానుకోటకు చెందిన ప్రముఖులను వరించాయి. మహబూబాబాద్‌కు చెందిన మాలె నాగేశ్వరరావు వర్తక వాణిజ్య కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా, తల్లాడి విజయ్‌కుమార్ పొలిటికల్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య సంఘ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.
వర్తక, వాణిజ్య రంగాల్లో విశేష అనుభవం కలిగిన మాలె నాగేశ్వరరావు గత నాలుగు దశాబ్దాలుగా మహబూబాబాద్ ప్రాంతంలో ఆర్యవైశ్యుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి తనవంతు సహకారం అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడంపై పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా వ్యాపారవేత్తగా, కాంట్రాక్టర్‌గా గుర్తింపు పొందిన తల్లాడి విజయ్‌కుమార్ ఆర్యవైశ్యులను రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో ఆర్యవైశ్యుల ప్రాధాన్యతను పెంపొందించడంతో పాటు సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడంపై పలువురు అభినందనలు తెలిపారు.
ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో కీలక పదవులు చేపట్టడం మహబూబాబాద్ జిల్లాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఈ నియామకాలతో జిల్లాలో ఆర్యవైశ్య సంఘం కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొద్దుటూరి గౌరీశంకర్, ఆర్యవైశ్య మహాసభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తల్లాడ వెంకట్రామారావు, ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

