- న్యాయవాదులకు అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళి మోహన్
మహబూబాబాద్ (చైతన్యగళం):
నేర న్యాయ వ్యవస్థలో న్యాయమైన విచారణ, సమర్థవంతమైన న్యాయవాద వృత్తి నిర్వహణకు ఫోరెన్సిక్ సైన్స్ ఎంతో కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళి మోహన్ అన్నారు. న్యాయవాదులకు ఫోరెన్సిక్ విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రోబ్‌ల్యాబ్ ఫోరెన్సిక్ సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో మహబూబాబాద్ బార్ అసోసియేషన్, ప్రోబ్‌ల్యాబ్ ఫోరెన్సిక్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఫోరెన్సిక్ సైన్స్ ప్రాముఖ్యత – నేర న్యాయ వ్యవస్థలో దాని ఉపయోగాలు’ అనే అంశంపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సదస్సులో ప్రోబ్‌ల్యాబ్ ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ ఎర్రగొల్ల ప్రధాన వక్తగా పాల్గొని వివాదాస్పద సంతకాలు, నకిలీ పత్రాలు, వేలిముద్రలు, డిజిటల్ ఆధారాల శాస్త్రీయ విశ్లేషణ తదితర అంశాలను వివరించారు. న్యాయపరమైన కేసుల్లో ఫోరెన్సిక్ ఆధారాల ప్రాధాన్యతను, నిపుణుల నివేదికలను అర్థం చేసుకోవాల్సిన విధానాన్ని వివరించారు. అవసరమైన సందర్భాల్లో శాస్త్రీయ పరిశీలనను వినియోగించుకోవడం ద్వారా కేసుల్లోని వాస్తవాలను వెలికితీయడంతో పాటు కోర్టుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఫోరెన్సిక్ సైన్స్‌పై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఆధారాల విశ్లేషణ, కేసుల సమగ్ర పరిశీలన, న్యాయ ప్రక్రియలో వృత్తిపరమైన నైపుణ్యాలను న్యాయవాదులు మరింత మెరుగుపరుచుకోవచ్చని సదస్సులో వివరించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, కార్యదర్శి సిద్ధార్థతో పాటు పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

