- రూ.100 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడి
నాగర్‌కర్నూల్, నవంబర్ 12 (నీలగిరి ఎక్స్‌ప్రెస్):
నాగర్‌కర్నూల్ జిల్లాలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఆయనపై కేసు నమోదు చేసిన అధికారులు ఒకేసారి పలు ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ, మాధవరం ప్రాంతాల్లో ఉన్న ఆయన నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి వెల్లడించారు.
తనిఖీల్లో 25 ఎకరాల భూమి, వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, 50 తులాల బంగారం, నాలుగు ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఆస్తుల విలువను ప్రభుత్వ లెక్కల ప్రకారం అంచనా వేస్తున్నామని, సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఒక డీఈఈ స్థాయి అధికారి వద్ద ఇంత భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ ప్రకటించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

