హైదరాబాద్, నవంబర్ 10 (చైతన్యగళం):
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సొంత ఆదాయం, ఖర్చుల నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీలకు వచ్చే అన్ని రకాల ఆదాయాలు, నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల సొంత ఆదాయం, ఖర్చుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను ప్రారంభించాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల నూతన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 31 జిల్లాలను ఈ రెండు బ్యాంకులకు విభజించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు ఖాతాల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
