ఆమనగల్లు, నవంబర్ 11 (చైతన్యగళం): ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ప్రముఖ సంఘసేవకుడు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు, సాయిరాం మెడికల్ షాప్ నిర్వాహకుడు పాపిశెట్టి రాము అన్నారు. కడ్తాల్ మండలానికి చెందిన విలేకరి తిరుపతయ్య ఈ నెల 3వ తేదీన ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న రాము మానవతా దృక్పథంతో స్పందించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం తిరుపతయ్య స్వగ్రామానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. తిరుపతయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తిరుపతయ్య త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పాపిశెట్టి రాము పేర్కొన్నారు. సమాజంలో మానవతా విలువలు, పరస్పర సహకార భావన మరింత పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాపిశెట్టి రాము మిత్రమండలి సభ్యులు నూతనగంటి భాస్కర్, శ్రీను నాయక్, భుజంగం, గ్రామ పెద్దలు, తిరుపతయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
