- రైతులు అప్రమత్తంగా ఉండాలి: మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ
హుస్నాబాద్, అక్టోబర్ 29 (చైతన్యగళం):
హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో వరి పంటను కత్తెర పురుగు ఆశించినట్లు మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ, వ్యవసాయ విస్తరణ అధికారులు గుర్తించారు. గురువారం రైతులు స్వామి, పిట్టల బాలయ్య, కాసర్ల ఐలయ్యకు చెందిన వరి పొలాలను సందర్శించి పంట పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ కత్తెర పురుగు రాత్రివేళల్లో వరి మొక్కల కాండాలను నేలమట్టానికి దగ్గరగా కత్తిరించి పంటకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. రైతులు సాయంత్రం, రాత్రి వేళల్లో పొలాలను పరిశీలిస్తూ పురుగులను గుర్తించి ఏరివేసి నాశనం చేయాలని సూచించారు. పొలం గట్లపై ఉన్న గడ్డి, కలుపు మొక్కలను తొలగించడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
పంటలో పురుగు ఉధృతిని బట్టి వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. పంటను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ పురుగు లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.
