-
కసిరెడ్డి నారాయణరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి: వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా
ఆమనగల్లు, అక్టోబర్ 28 (చైతన్యగళం):
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ విద్యాసంస్థలపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా తీవ్రంగా ఖండించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో మెకానిక్ బాబా మాట్లాడుతూ.. బ్రిలియంట్ విద్యాసంస్థలు గత 25 ఏళ్లుగా వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ఈ సంస్థల్లో చదువుకున్న పలువురు విద్యార్థులు వైద్యులు, ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులుగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న సంస్థలపై విమర్శలు చేయడం వారిని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారని మెకానిక్ బాబా పేర్కొన్నారు. ఆయన సేవలను విమర్శించే ముందు తీన్మార్ మల్లన్న వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆమనగల్లు, కల్వకుర్తి ప్రాంతాల్లో కేఎన్‌ఆర్ సేవాదళం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మెకానిక్ బాబా హెచ్చరించారు.
