- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ దంపతులు
నాగర్కర్నూల్, అక్టోబర్ 15 (చైతన్యగళం): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం అమ్మవారికి శ్రీ లలితా దేవి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ప్రాతఃకాల పూజల్లో భాగంగా ఉత్సవమూర్తికి దంపతీ సమేతంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు మిడిదొడ్డి అంజయ్య, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు బిల్లకంటి హరిబాబు, ఇతర ఆర్యవైశ్య నాయకులు పూర్ణకుంభంతో ఎస్పీ దంపతులకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలందరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకుడు జోషి పాండురంగ శర్మ ఆధ్వర్యంలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, దుర్గాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి మహానీరాజనం సమర్పించారు.
సాయంత్రం ప్రదోష పూజల అనంతరం ఉత్సవమూర్తులకు హారతి, పల్లకీసేవ, డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య పట్టణ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
