- మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్
- సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని గౌరమ్మను ప్రార్థించాలి
హుస్నాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం):
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహిళలు, ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. పండుగ సంబరాల్లో భాగస్వాములై మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గౌరమ్మను పూజిస్తూ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకోవాలని కోరారు.

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో వ్యవసాయానికి అవసరమైన సమృద్ధి వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని రైతులందరూ మంచి పంటలు పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని గౌరమ్మను ప్రార్థించాలని సూచించారు.
బతుకమ్మ ఆడుతూ పాటలు పాడుతూ తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సును కోరుకునే మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా ప్రార్థించాలని మంత్రి అన్నారు. రంగురంగుల పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలు, ఆడపడుచులంతా ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు, ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.
