Thursday, October 15, 2026
Homeతెలంగాణబతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్  అక్టోబర్ 15.(చైతన్యగళం):

హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అలాగే అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఈ మేరకు సచివాలయం నుంచి కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో దూరవాణి సమావేశం నిర్వహించారు.

గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు. ఉపాధి హామీ పథకం కింద బతుకమ్మ ఘాట్ల వద్ద పరిశుభ్రత, మట్టి పనులు, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. ఏర్పాట్లలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు

హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని మూడు జిల్లాల్లో సహాయక పరికరాల పంపిణీ కోసం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ప్రత్యేక శిబిరాల నిర్వహణపై సమాచారం క్షేత్రస్థాయి వరకు చేరిందా అనే అంశాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆధ్వర్యంలో, దివ్యాంగుల సహాయ పథకం కింద అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. డప్పు చాటింపుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి, ఒక్క అర్హుడైన లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా గుర్తించి, ప్రతి ఒక్కరికీ సహాయక పరికరాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలకు ఒక రోజు, హనుమకొండ జిల్లాలో రెండు మండలాలకు ఒక రోజు, సిద్దిపేట జిల్లాలో మూడు మండలాలకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శిబిరాల నిర్వహణకు ముందుగానే అర్హులైన లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తి స్థాయి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. అర్హులైన వారందరూ శిబిరాలకు హాజరయ్యేలా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, ప్రాజెక్టు డైరెక్టర్లు, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారులు, ఇతర జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయక పరికరాలు అందించడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!