Wednesday, October 14, 2026
Homeతెలంగాణఓటు చోరీ ఆరోపణలపై ప్రధాని స్పందించాలి

ఓటు చోరీ ఆరోపణలపై ప్రధాని స్పందించాలి

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, అక్టోబర్ 13 (చైతన్యగళం):

దేశంలో ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఓటు చోరీ అంశంపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ అంశంపై వివిధ వర్గాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొంటూ, సంబంధిత ఆరోపణలపై సమగ్రంగా స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.

మూడు మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి

హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌కు పాదయాత్రగా వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ నిర్ణయం అమలులోకి రాలేదని పేర్కొన్నారు. సంబంధిత మండలాలను కరీంనగర్ జిల్లాలో కలిపే ప్రక్రియను ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో ఈ అంశాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన నిర్ణయం వెలువడలేదని చాడ వెంకటరెడ్డి తెలిపారు.

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

హుస్నాబాద్ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ప్రజలకు తాగునీరు అందించేందుకు గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గండిపల్లి ప్రాజెక్టు పనులు సుమారు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయని పేర్కొంటూ, మిగిలిన పనుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.

ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటనలు చేయడంతో పాటు, అవసరమైన నిధులను కేటాయించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. హుస్నాబాద్ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌కు విజయం సాధించిన కార్మికులకు చాడ వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యలు, హక్కులు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్మికుల సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే సీపీఐ తరఫున వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటం

రాష్ట్రంలో ప్రజా పాలన, ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తున్నామని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సీపీఐ త్వరలో కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతుందని వెల్లడించారు.

విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, హుస్నాబాద్ నియోజకవర్గ సీపీఐ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, సీపీఐ మండల సహాయ కార్యదర్శి పొదిల కుమారస్వామి, సీపీఐ మండల నాయకులు పిట్టల మెగిలయ్య, ఎనగందుల లక్ష్మినారాయణ, పిట్టల ప్రసాద్, అయిలేని మల్లారెడ్డి, పిట్టల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!