Wednesday, October 14, 2026
Homeతెలంగాణకరీంనగర్నగరపాలక సంస్థ వాహనాల జీపీఎస్‌ వ్యవస్థ, ఇంధన సెన్సార్ల తనిఖీ

నగరపాలక సంస్థ వాహనాల జీపీఎస్‌ వ్యవస్థ, ఇంధన సెన్సార్ల తనిఖీ

📰 Generate e-Paper Clip

  • అభివృద్ధి పనుల పర్యవేక్షణకు డాష్‌బోర్డ్‌ వినియోగించాలి: కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌
  • ఇంజినీరింగ్‌ అధికారులకు, సిబ్బందికి అవగాహన

కరీంనగర్‌, అక్టోబర్‌ 13 (చైతన్యగళం):

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వాహనాల నిర్వహణను పర్యవేక్షించడంతో పాటు అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమీకృత నియంత్రణ కేంద్రాన్ని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ సందర్శించారు.

కేంద్రంలోని అధికారులతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన వివిధ వాహనాల జీపీఎస్‌ ఆధారిత గమనింపు వ్యవస్థను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల రవాణా నిర్వహణ, ఇంధన సెన్సార్లు, వాహనాల రికార్డులను ప్రత్యక్ష స్థాన వివరాల ఆధారంగా పరిశీలించారు.

అభివృద్ధి పనుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి

నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పూర్తి వివరాలను నమోదు చేసి, వాటి పురోగతిని పర్యవేక్షించేందుకు సమీకృత నియంత్రణ కేంద్రం ప్రతినిధులు రూపొందించిన నూతన ‘డాష్‌బోర్డ్‌’ అనువర్తనంపై ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. కేంద్రం ప్రతినిధులతో కలిసి కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ దృశ్యప్రదర్శన ద్వారా ఈ విధానం వినియోగంపై వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా పర్యవేక్షించేందుకు డాష్‌బోర్డ్‌ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలను ఇందులో నమోదు చేయడం ద్వారా పనులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

వివిధ నిధులు, పద్దుల వారీగా అభివృద్ధి పనుల వివరాలను పర్యవేక్షించవచ్చని తెలిపారు. పనుల కోసం నిర్వహించిన టెండర్లు, ఒప్పందాల వివరాలు, పనుల పురోగతి, పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించారు.

డాష్‌బోర్డ్‌లో ప్రతి పనికి సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేసి, ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ నూతన సాంకేతిక విధానంలో పర్యవేక్షించేలా ఈ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, సహాయ కమిషనర్‌ రాజమనోహర్‌, పర్యవేక్షక ఇంజినీర్‌ సంపత్‌రావు, కార్యనిర్వాహక ఇంజినీర్‌ లచ్చిరెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు దేవేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్‌, శ్రీనివాస్‌, సహాయ ఇంజినీర్‌ సతీష్‌, ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బంది, సమీకృత నియంత్రణ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!