Saturday, October 10, 2026
Homeతెలంగాణకరీంనగర్సుదర్శన్‌ చారి మరణం సీపీఐకి తీరని లోటు

సుదర్శన్‌ చారి మరణం సీపీఐకి తీరని లోటు

📰 Generate e-Paper Clip

  • సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్‌

హుస్నాబాద్‌ , అక్టోబరు 9 (చైతన్యగళం):

హుస్నాబాద్‌ మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకుడు, మాజీ మండల కార్యదర్శి, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు, తాలూకా కార్యాలయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించిన వలువొజు సుదర్శన్‌ చారి మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, హుస్నాబాద్‌ మాజీ ఉప ఎంపీపీ గడిపె మల్లేశ్‌ అన్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్‌ చారి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన గడిపె మల్లేశ్‌ ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

పేదల పక్షాన పోరాడిన నాయకుడు

ఈ సందర్భంగా గడిపె మల్లేశ్‌ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించిన సుదర్శన్‌ చారి కులవృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారని, తన కుమారులను ఉన్నత చదువులు చదివించి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. చిన్నతనం నుంచే గ్రామంలో పటేల్‌, పట్వారీలు, దొరల అక్రమాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా నీడన పోరాటం సాగించారని కొనియాడారు.

అన్యాయాలపై పోరాడటంతో పాటు గ్రామ అభివృద్ధికి సుదర్శన్‌ చారి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి, పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.

ఆశయాల సాధనకు కృషి చేయాలి

సుదర్శన్‌ చారి ఆశయాలను కొనసాగిస్తూ యువత పేదల అభ్యున్నతికి కృషి చేయాలని గడిపె మల్లేశ్‌ పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ సమాజంలో సమానత్వం సాధించేందుకు ముందుకు రావాలని, అప్పుడే సుదర్శన్‌ చారి ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్‌, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి మౌటం బాలయ్య, సీపీఐ మండల నాయకుడు బోయిని ఎల్లయ్య, సీపీఐ నాయకుడు వలువోజు మల్లయ్య, కురుమెల్లి రాములు, సుదర్శన్‌ చారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!