- సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతనూ పరిగణనలోకి తీసుకోవాలి: దర్శన్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 9 (చైతన్యగళం): పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందన్న వ్యాఖ్యలు సరికావని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్‌గౌడ్ అన్నారు. ఓపీఎస్ అమలుపై జయప్రకాశ్ నారాయణ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆయన ఖండించారు.
దశాబ్దాలపాటు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించడం సామాజిక బాధ్యత అని దర్శన్‌గౌడ్ పేర్కొన్నారు. పెన్షన్‌ను కేవలం ఆర్థిక భారంగా చూడకుండా ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తు, వృద్ధాప్య వైద్య ఖర్చులు, స్థిరమైన ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఓపీఎస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని చెప్పేవారు అందుకు సంబంధించిన గణాంకాలు, దీర్ఘకాలిక ఆర్థిక అంచనాలను వివరించాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానంలో పదవీ విరమణ అనంతరం లభించే పెన్షన్‌పై ఉద్యోగుల్లో అనిశ్చితి ఉందని తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక, కుటుంబ భద్రతపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మేధావులు దృష్టి సారించి సంఘాలతో చర్చించాలని కోరారు. ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం తరఫున డిమాండ్ చేశారు.
