- 2,206 మంది విద్యార్థులకు అల్పాహారం.. సమర్థంగా అమలు చేసిన పాఠశాలల సిబ్బంది
హుస్నాబాద్ , అక్టోబరు 1 (చైతన్య గళం): ప్రభుత్వ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం బుధవారం విజయవంతంగా ప్రారంభమైంది. విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు అందించారు.
మండలంలోని ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల నుంచి 998 మంది విద్యార్థులకు గాను 920 మంది, 6 నుంచి 12వ తరగతుల విద్యార్థులు 1,208 మందికి గాను 1,145 మంది అల్పాహారం స్వీకరించారు. పాఠశాలల్లో పనిచేస్తున్న 195 మంది బోధన, బోధనేతర సిబ్బందిలో 96 మంది అల్పాహారం తీసుకున్నారు.
అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వంట సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు సకాలంలో పాఠశాలకు హాజరై పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యా ప్రగతికి ఈ పథకం దోహదపడుతుందని మండల విద్యాధికారి బండారి మనిల్ తెలిపారు.
కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వంట సిబ్బంది, సంబంధిత అధికారులను మండల విద్యాధికారి అభినందించారు.
