- శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన
శ్రీశైలం, సెప్టెంబరు 21 (చైతన్యగళం): చెంచు గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చెంచు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లమల్లలోని వివిధ చెంచుగూడాలకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు వెంకటస్వామి, అంకన్న, ఐలేని కృష్ణుడు, ఈర్లయ్య, వెంకటేశం మాట్లాడుతూ.. శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. చెంచు గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫుడ్ బాస్కెట్ పంపిణీలో జరిగినట్లు పేర్కొంటున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
ఎస్ఆర్‌ఆర్ ఏజెన్సీ ద్వారా వివిధ ఆశ్రమ పాఠశాలల్లో స్థానిక చెంచు గిరిజనులనే పారిశుద్ధ్య కార్మికులుగా నియమించాలని, చెంచు గిరిజనుల పొలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీవోను బదిలీ చేయాలని కోరుతూ నల్లమల్ల చెంచు గిరిజనులు ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో వివిధ చెంచుగూడాలకు చెందిన గిరిజన నాయకులు, చెంచు గిరిజనులు పాల్గొన్నారు.
