- వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పద్మశాలి సంఘం నాయకులు
కోహెడ, సెప్టెంబర్ 21 (చైతన్యగళం): స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని పద్మశాలి సంఘం బస్వాపూర్ గ్రామ అధ్యక్షుడు కొక్కుల రమేష్, గాదాసు భాస్కర్ కోరారు. సోమవారం కోహెడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ సాధన కోసం జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బస్వాపూర్ సర్పంచ్ బానోతు లింగం నాయక్, మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్, కొక్కుల సురేష్, సుధగోని యాదగిరి, సానాది సింగరి తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
