- నేర నియంత్రణపై సీపీ గౌష్ ఆలం సమీక్ష.. నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత
కరీంనగర్, సెప్టెంబరు 14 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఆగస్టు నెల నేర సమీక్ష సమావేశంలో నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు, కోర్టు కేసులు, సైబర్ నేరాలు, మహిళలు–చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు.
గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర ఫోన్ నంబర్లను ప్రదర్శించాలని, వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట తదితర నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్, గజ ఈతగాళ్లతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ అమలు చేయాలని, సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేరాల దర్యాప్తులో వేగం
నేరం జరిగిన వెంటనే శాస్త్రీయ ఆధారాలతో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టు విచారణలో ఉన్న కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరాల కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పీఓసీఎస్‌ఓ, అత్యాచారం, ఇతర మహిళా సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి
సైబర్ నేర బాధితులకు వీలైనంత త్వరగా నగదు రికవరీ అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. సీఈఐఆర్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీని వేగవంతం చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలు, గుట్కా, పేకాట, అక్రమ ఇసుక రవాణా తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
లోక్ అదాలత్‌లో 4,268 కేసుల పరిష్కారం
సెప్టెంబరు 12న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,268 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. వీటిలో 451 ఎఫ్‌ఐఆర్ కేసులు, 1,019 ప్రమాద, ఇతర సంబంధిత కేసులు, 2,798 మోటారు వాహన కేసులు, 34 సైబర్ కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులు పరిష్కరించిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్–685, కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్–495 అధికారులతో పాటు కేసుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులను సీపీ అభినందించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని ప్రజలు, ఉత్సవ కమిటీలకు సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో అదనపు డీసీపీ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి.కృష్ణమూర్తి, ఏసీపీలు, సీఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
