Saturday, August 15, 2026
Homeతెలంగాణఅత్యుత్తమ పోలీసు సేవకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్

అత్యుత్తమ పోలీసు సేవకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్యగళం):

పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు, అంకితభావం, క్రమశిక్షణ, సమర్థవంతమైన విధి నిర్వహణకు గుర్తింపుగా కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణకు ప్రతిష్ఠాత్మక ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ (PPM/MSM) లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్‌లో భాగంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.

1991లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో సేవా ప్రస్థానం ప్రారంభించిన పి. వెంకట రమణ హైదరాబాద్ ట్విన్ సిటీస్‌లోని పలు కీలక, మతపరంగా సున్నితమైన ప్రాంతాలతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. 2005లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందించడంతో పాటు చత్రినాక, ముషీరాబాద్, అంబర్‌పేట్, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహించారు.

2017లో ఏసీపీగా పదోన్నతి పొందిన అనంతరం హైదరాబాద్ ట్రాఫిక్ బ్రాంచ్, గోపాలాపురం, నార్త్ జోన్, తెలంగాణ విజిలెన్స్, ఎస్‌ఆర్‌నగర్, వెస్ట్ జోన్ తదితర ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

కీలక కేసుల ఛేదనలో కీలక పాత్ర

సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సమయంలో మాండ్రక్స్, ఎన్‌డీపీఎస్ కేసులు, అక్రమ ఆయుధాల స్వాధీనం, నార్త్ ఇండియన్ గ్యాంగ్స్, నకిలీ స్టాంపులు, నకిలీ ఇందిరా వికాస్ పత్రాలు, గంజాయి, నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించిన పలు కీలక కేసుల ఛేదనలో వెంకట రమణ కీలక పాత్ర పోషించారు. జడ్చర్ల ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో హత్యలు, హైవే దోపిడీలు, గ్యాంగ్‌రేప్ వంటి తీవ్రమైన కేసులను ఛేదించి నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టారు.

విశిష్ట సేవలకు అనేక పురస్కారాలు

పి. వెంకట రమణ తన విశిష్ట సేవలకు ఇప్పటికే తెలంగాణ పోలీస్ సేవా పతకం (2010), తెలంగాణ పోలీస్ ఉత్తమ సేవా పతకం (2018), యూనియన్ హోం మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్–2022 వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఆయన సేవా రికార్డులో 107 క్యాష్ రివార్డులు, ఒక అడ్వాన్స్ ఇన్‌క్రిమెంట్, ఏడు ప్రశంసా పత్రాలు, నాలుగు అభినందనలు, 15 ఎంఎస్‌సీలు, 162 జీఎస్‌ఈలు ఉన్నాయి.

2025 మే 22న అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన, అదే ఏడాది జూన్ 2 నుంచి కరీంనగర్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీ (అడ్మిన్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

క్రమశిక్షణ, అంకితభావం, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజా భద్రత పట్ల నిబద్ధతతో విశిష్ట సేవలు అందించిన పి. వెంకట రమణకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ లభించడం పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!