- విద్యుత్ స్తంభాలపై జిగ్‌జాగ్ కేబుళ్లకు చెక్
- పోల్ యుటిలైజేషన్ లెక్కింపు.. జాయింట్ ఇన్‌స్పెక్షన్‌కు షెడ్యూల్
కరీంనగర్, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): విద్యుత్ స్తంభాలను వినియోగిస్తున్న కేబుల్ టీవీ, ఫైబర్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు విద్యుత్ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. కరీంనగర్ టౌన్ డివిజన్ పరిధిలో ఏడీఈ, ఏఈల పర్యవేక్షణలో కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి, విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుళ్లను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు.
రోడ్డు క్రాసింగ్‌ల వద్ద జిగ్‌జాగ్‌గా వేలాడుతున్న కేబుళ్లను తొలగించి సక్రమంగా అలైన్‌మెంట్ చేయాలని అధికారులు సూచించారు. రానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేబుళ్లను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ఒకేచోట గుంపులుగా ఉన్న బంచింగ్ కేబుళ్లను తొలగించి క్రమపద్ధతిలో అమర్చాలని తెలిపారు.
కేబుళ్లను విద్యుత్ స్తంభాలకు నిబంధనల ప్రకారం క్లాంపుల ద్వారా బిగించాలని, ప్రతి కేబుల్‌కు సంబంధిత సంస్థ వివరాలతో కూడిన ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కేబుల్ మార్గానికి సంబంధించిన జీఐఎస్ సర్వే, రూటింగ్ వివరాలను విద్యుత్ శాఖ అధికారులకు అందజేయాలని స్పష్టం చేశారు.
స్తంభం.. ఎవరిది కేబుల్?
విద్యుత్ స్తంభాలను ఏయే సంస్థలు వినియోగిస్తున్నాయో గుర్తించేందుకు పోల్ యుటిలైజేషన్ లెక్కింపు, వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఇందుకోసం జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కరీంనగర్ టౌన్ డివిజన్ పరిధిలోని అన్ని కేబుల్ టీవీ, ఫైబర్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం జాయింట్ ఇన్‌స్పెక్షన్‌కు తప్పనిసరిగా హాజరై విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే తొలగింపు
కేబుళ్లను సక్రమంగా అమర్చడం ద్వారా రోడ్డు భద్రత, ప్రజల భద్రతను కాపాడటంతో పాటు విద్యుత్ స్తంభాలపై అనవసరమైన కేబుల్ బంచింగ్‌ను నివారించవచ్చని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని కేబుళ్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
