Sunday, August 2, 2026
Homeఎడిటోరియల్పుస్తకాల భారంతో నలిగిపోతున్న బాల్యం – ఆటలకు దూరమవుతున్న నేటి పిల్లలు

పుస్తకాల భారంతో నలిగిపోతున్న బాల్యం – ఆటలకు దూరమవుతున్న నేటి పిల్లలు

📰 Generate e-Paper Clip

బాల్యం అంటే ఆనందం.. కానీ నేడు?

బాల్యం అనేది జీవితంలో అత్యంత మధురమైన దశ. ఈ దశలో పిల్లలు ఆడుతూ పాడుతూ నవ్వుతూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఎదగాలి. ఒకప్పుడు పాఠశాల ముగిసిన వెంటనే పిల్లలు వీధుల్లోకి పరుగులు తీసి క్రికెట్ కబడ్డీ కోకో దాగుడుమూతలు గిల్లి-డండా వంటి ఆటలతో సాయంత్రం వరకు గడిపేవారు. ఆటల ద్వారా స్నేహం సహకారం నాయకత్వం క్రమశిక్షణ ఓటమిని అంగీకరించే మనస్తత్వం వంటి ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకునేవారు.

అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాల్యం అంటే ఆటలు కాదు పుస్తకాల భారం హోంవర్క్‌లు పరీక్షలు ట్యూషన్లు కోచింగ్ సెంటర్లు ర్యాంకుల పోటీగా మారిపోయింది. పిల్లల జీవితంలో నవ్వులు తగ్గి ఒత్తిడి పెరిగింది. బాల్యం అనే అందమైన కాలం మార్కుల కోసం జరిగే పోటీకి బలవుతోంది.
మారుతున్న విద్యా విధానం పెరుగుతున్న ఒత్తిడి నేటి విద్యా వ్యవస్థలో చిన్న తరగతుల నుంచే పిల్లలపై తీవ్రమైన పోటీ వాతావరణం ఏర్పడుతోంది. ఎల్‌కేజీ యూకేజీ నుంచే ఇంగ్లీష్ గణితం కంప్యూటర్లు ప్రత్యేక తరగతులు, పరీక్షలు మొదలవుతున్నాయి. పాఠశాల ముగిసిన తర్వాత కూడా ట్యూషన్లు ఆన్‌లైన్ క్లాసులు హోంవర్క్‌లతో పిల్లలకు విశ్రాంతి లేకుండా పోతోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇతరుల కంటే ముందుండాలని ఆశిస్తూ అదనపు కోచింగ్‌కు పంపిస్తున్నారు. దీంతో పిల్లల రోజంతా చదువుకే పరిమితమవుతోంది. ఆటలకు కుటుంబంతో గడపడానికి ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా సమయం దొరకడం లేదు.
మార్కుల కోసం పరుగు – బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులు
“ఎన్ని మార్కులు వచ్చాయి?”, “ర్యాంక్ ఎంత వచ్చింది?” అనే ప్రశ్నలు నేటి పిల్లల జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా మారాయి. మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి పిల్లల్లో భయం ఆందోళన నిరాశను పెంచుతోంది.

పిల్లల ప్రతిభను కేవలం మార్కులతోనే కొలవడం సరైన విధానం కాదు. ప్రతి పిల్లవాడిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. కొందరు చదువులో రాణిస్తే మరికొందరు క్రీడలు సంగీతం చిత్రలేఖనం విజ్ఞానం లేదా ఇతర రంగాల్లో అద్భుత ప్రతిభ చూపగలరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి.

ఆటలు ఎందుకు అవసరం?

ఆటలు పిల్లల జీవితంలో ఒక వినోదం మాత్రమే కాదు. అవి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పునాది. ఆటల వల్ల కలిగే ప్రయోజనాలు:
శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎముకలు కండరాలు దృఢంగా తయారవుతాయి.
ఊబకాయం మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
స్నేహభావం జట్టు భావన పెరుగుతుంది.
నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఓటమిని అంగీకరించడం విజయాన్ని వినయంగా స్వీకరించడం అలవాటు అవుతుంది.
సృజనాత్మకత సమస్యలను పరిష్కరించే నైపుణ్యం పెరుగుతుంది.
ఆటలు లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలు
నేటి పిల్లలు ఎక్కువసేపు పుస్తకాల ముందు లేదా మొబైల్ కంప్యూటర్ ముందు గడపడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
చిన్న వయసులోనే కళ్ల సమస్యలు.
మెడ వెన్నునొప్పులు.
ఊబకాయం.
శారీరక దృఢత్వం తగ్గిపోవడం.
ఒత్తిడి ఆందోళన.
కోపం చిరాకు పెరగడం.
సామాజిక సంబంధాలు తగ్గిపోవడం. ప్రకృతికి దూరమవడం. కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోవడం.
ఈ పరిస్థితి భవిష్యత్తులో సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

తల్లిదండ్రుల పాత్ర

తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చకుండా వారి ఆసక్తులు ప్రతిభను గుర్తించాలి. మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా చదువుతో పాటు ఆటలకు కూడా సమయం కేటాయించేలా ప్రోత్సహించాలి. ప్రతి రోజు కనీసం ఒక గంటపాటు బయట ఆడుకునే అవకాశం కల్పించాలి.
పిల్లలతో మాట్లాడడం వారి భావాలను అర్థం చేసుకోవడం వారి విజయాలను మాత్రమే కాకుండా ప్రయత్నాలను కూడా అభినందించడం ఎంతో ముఖ్యం.

పాఠశాలల బాధ్యత

పాఠశాలలు విద్యార్థులపై హోంవర్క్ భారాన్ని తగ్గించాలి. ప్రతిరోజూ క్రీడలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. ప్రతి విద్యార్థి కనీసం ఒక ఆటలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు కళలు కూడా విద్యలో భాగమని గుర్తించాలి.
మార్కుల కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే విద్యా విధానం అవసరం. సమాజం చేయాల్సింది
పిల్లలు సురక్షితంగా ఆడుకునేందుకు ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ఆటస్థలాలు ఉండాలి. పార్కులను పరిరక్షించాలి. మొబైల్ ఫోన్లు టెలివిజన్‌లకే పరిమితం కాకుండా పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా పెద్దలు ప్రోత్సహించాలి.
పిల్లల బాల్యం జీవితంలో తిరిగి రాని అమూల్యమైన దశ. ఆ దశను పుస్తకాల భారంతో పరీక్షల ఒత్తిడితో నింపితే వారి వ్యక్తిత్వ వికాసం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. చదువు జీవితానికి అవసరం. కానీ ఆటలు జీవితానికి ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం సృజనాత్మకతను అందిస్తాయి. కాబట్టి చదువు–ఆటల మధ్య సమతుల్యతను పాటించడం కుటుంబం పాఠశాల ప్రభుత్వం సమాజం అందరి బాధ్యత.
“పిల్లలకు మంచి మార్కులు మాత్రమే కాదు… మంచి బాల్యాన్ని కూడా అందిద్దాం. పుస్తకాలతో పాటు ఆటలకూ సమాన ప్రాధాన్యం ఇచ్చి ఆరోగ్యవంతమైన ఆనందమయమైన సృజనాత్మక భారత భవిష్యత్తును నిర్మిద్దాం.”

మంగయ్య గారి వెంకటేశం

కరీంనగర్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!