- జూలై 31న సంయుక్త తనిఖీలు
ఆమనగల్లు, జూలై 30 (చైతన్యగళం):
అకుతోటపల్లి గ్రామంలోని సర్వే నెం.304లో ప్రతిపాదిత క్వారీలు, స్టోన్ క్రషర్ ఏర్పాటుపై గ్రామ ప్రజలు, రైతులు సమర్పించిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం స్పందించారు. ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్, సంబంధిత శాఖలు సంయుక్తంగా స్థల తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గనులు & భూగర్భశాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, తహసీల్దార్ కార్యాలయ అధికారులు కలిసి జూలై 31, 2026 ఉదయం 10:30 గంటలకు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్నారు. తనిఖీల అనంతరం నివేదికను జిల్లా యంత్రాంగానికి అందజేయనున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ప్రతిపాదిత క్వారీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పాఠశాలకు సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో గనుల కార్యకలాపాలు చేపట్టడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యా వాతావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. అలాగే బ్లాస్టింగ్, స్టోన్ క్రషింగ్, భారీ లారీల రాకపోకల కారణంగా దుమ్ము, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా అధికమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంయుక్త తనిఖీల అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగా జిల్లా యంత్రాంగం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
