హుస్నాబాద్, జూలై 21 (చైతన్యగళం):
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) స్వామి సూచించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని మహ్మదాపూర్ గ్రామంలో సర్పంచ్ జిల్లెల తిరుమల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ స్వామి మాట్లాడుతూ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ, వేరుశెనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.

తక్కువ కాలవ్యవధి గల పంట రకాలను ఎంపిక చేసుకోవడం, నేలలో తేమను సంరక్షించే పద్ధతులు పాటించడం, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సలహాల మేరకు సాగు పనులు చేపట్టాలని రైతులకు సూచించారు. అనంతరం రైతుల సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ సురేష్, ఏడీ వెటర్నరీ కొండల్ రెడ్డి, సర్పంచ్ జిల్లెల తిరుమల, ఉపసర్పంచ్ కత్తుల సమ్మరాజు, ఎంపీఓ రమేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రోహిత్, ఏపీఓ పద్మ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
