కరీంనగర్, సెప్టెంబర్ 5(చైతన్యగళం):
లోక్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా వీధి విక్రయదారుల కోసం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మెప్మా అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులు, సీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల యూనిఫాంల తయారీ, వీధి విక్రయదారుల శిబిరాలు, సామాజిక భద్రత పథకాలు, పెండింగ్ చీరల పంపిణీపై సమీక్షించారు. అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి రుణాలు అందించాలని, రెండో విడత రుణాలు పొందిన వారికి కార్డులు జారీ చేయాలని సూచించారు. విక్రయదారుల వివరాలను నమోదు చేసి సామాజిక భద్రత పథకాలను అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పెండింగ్ చీరల పంపిణీని పూర్తి చేయడంతో పాటు పాఠశాల యూనిఫాంలను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న వారికి అవగాహన కల్పించి, సరైన ధ్రువపత్రాలతో నోటీసులను పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో మెప్మా పీడీ స్వరూపరాణి, డీఎంసీ శ్రీ వాణి, టీఎంసీ సునీత, సీవోలు తదితరులు పాల్గొన్నారు.
