నల్లగొండ, జూలై 18 (చైతన్యగళం):
ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమం సందర్భంగా హిందూ ఆధ్యాత్మిక వేత్త, రచయిత, సామాజిక విశ్లేషకుడు జై భారత్ రమణమూర్తిపై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేడు నల్లగొండలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కెవిపిఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని, భిన్నాభిప్రాయాలను హింసతో కాకుండా చర్చల ద్వారా ఎదుర్కోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించే సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
రమణమూర్తిపై జరిగిన దాడిపై పోలీసులు ఫిర్యాదును చట్టప్రకారం విచారించి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రచయితలు, పాత్రికేయులు, కళాకారులు, మేధావులు భయాందోళనలు లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
సమాజంలో మత విద్వేషాలు, హింస, అసహనం పెరగకుండా ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవించాలని, అన్ని మతాల పట్ల పరస్పర గౌరవం, శాంతి, సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను ఎవరైనా చేపట్టినా చట్టం ముందు సమానంగా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
డిమాండ్లు
- జై భారత్ రమణమూర్తిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు, మతపెద్దలు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాలి.
- ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలి.
- రచయితలు, పాత్రికేయులు, కళాకారులు, మేధావులపై బెదిరింపులు, దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి.
- మతం పేరుతో ద్వేషం, హింసను ప్రోత్సహించే చర్యలను అరికట్టి రాజ్యాంగ విలువలు, శాంతి, సామరస్యాన్ని పరిరక్షించాలి.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాదె నరసింహ, బొల్లు రవీందర్ కుమార్, సిఐటియు పట్టణ కన్వీనర్ దండంపల్లి సత్తయ్య, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, నాయకులు జిల్లా అంజయ్య, బచ్చలకూరి రాధాకృష్ణ, రాచమల్ల వెంకటరెడ్డి, శంకర్, మాతంగి రవి, మురళి, మహేంద్ర, శివకుమార్, నారయ్య, శ్రీను, గ్యార చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
