వనపర్తి, జూలై 18 (చైతన్యగళం): మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నెల్సన్ మండేలా 108వ జయంతి, ప్రజాకవి–లోకకవి డాక్టర్ అందెశ్రీ 65వ జయంతి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ మండేలా జాతి వివక్ష నిర్మూలన కోసం చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, డాక్టర్ అందెశ్రీ తెలంగాణ ఉద్యమానికి తన సాహిత్యంతో విశేష సేవలందించారని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కవిపండితుడు బూరోజు గిరిరాజాచారి, డాక్టర్ నాయికంటి నరసింహశర్మ, గంధం నాగరాజు, దేవన నాయుడు, చింతకుంట కురుమయ్య, శ్రీనివాసులు శెట్టి, డాక్టర్ భగవంతు శేఖర్, వెంకటేష్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
