Friday, July 17, 2026
Homeతెలంగాణకరీంనగర్సెప్టెంబర్‌లోపు తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

సెప్టెంబర్‌లోపు తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం):
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. తొలి విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్‌లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, పెద్ద ఎత్తున గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెండో విడతలో నిజమైన అర్హులైన పేదలకు ప్రాధాన్యం కల్పించి ఇళ్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మాణ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులు, గృహప్రవేశాల నిర్వహణలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా నిలిచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. తొలి విడత ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలతో పాటు నిజమైన అర్హులను గుర్తించి వారికి ప్రాధాన్యమివ్వాలని, ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పీడీ గంగారాం, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!