హుస్నాబాద్,జూలై 15 (చైతన్యగళం):
జిల్లాలోని అన్ని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి, విద్యా సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం హుస్నాబాద్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. వంటగదిలో తయారు చేసిన అన్నం, అలసందకాయ కూర, సాంబారు, పెరుగు, గోంగూర పచ్చడిని పరిశీలించి వాటి నాణ్యతను తెలుసుకున్నారు.

అనంతరం స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి, రిజిస్టర్‌లో నమోదైన సరుకులకు అనుగుణంగా వంటలు తయారయ్యాయా లేదా అనే విషయాన్ని స్వయంగా కొలతలు వేసి పరిశీలించారు. విద్యార్థుల హాజరుకు అనుగుణంగా సరుకులు వినియోగించాలని, ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి వంటకం నాణ్యంగా, రుచికరంగా తయారు చేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.
సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్, అవి సక్రమంగా పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీ ప్రాంగణమంతా నిరంతరం నిఘా ఉండేలా అన్ని సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడిన కలెక్టర్, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మధ్యాహ్న భోజనంలో ఏమి తిన్నారో అడిగి తెలుసుకున్నారు. కోతుల బెడద ఉందని, అన్నం, పప్పు, సాంబారుతో భోజనం చేశామని విద్యార్థులు తెలిపారు.
స్టోర్‌రూమ్‌లో వంట సామగ్రిని విద్యార్థుల సమక్షంలోనే కొలత వేసి తీసుకోవాలని, చదువు, భోజనం, వసతి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత స్పెషల్ ఆఫీసర్‌కు ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.
