మహబూబాబాద్, జూలై 7(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.64.24 లక్షల విలువైన 128.496 కిలోల డ్రై గంజాయిని మంగళవారం చట్టప్రకారం పూర్తిగా దగ్ధం చేశారు.
‘ఈగల్’ (Elite Action Group for Drug Law Enforcement) ఆదేశాల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థానం అనుమతితో ఈ ప్రక్రియ చేపట్టారు. మహబూబాబాద్ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడి వేస్ట్ యూనిట్‌లో ప్రత్యేక యంత్రాల ద్వారా గంజాయిని పూర్తిగా నాశనం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గండ్రాతి మోహన్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోందన్నారు. గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
