Wednesday, September 9, 2026
Homeఆంధ్రప్రదేశ్చిన్నారిపై అమానుషం.. ఇద్దరు నిందితుల అరెస్టు

చిన్నారిపై అమానుషం.. ఇద్దరు నిందితుల అరెస్టు

📰 Generate e-Paper Clip

  • తాడుతో కట్టేసి హింసించిన వైనం.. గంటల వ్యవధిలో పోలీసుల అదుపులోకి
  • మైనర్‌ బాలిక ఫొటోలు, వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ రామాంజి నాయక్‌

ఆత్మకూరు, ఆగస్టు 18 (చైతన్యగళం): తొమ్మిదేళ్ల చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. అంగట్లో దొంగతనం చేసిందనే అనుమానంతో చిన్నారిని అక్రమంగా నిర్బంధించి, తాడుతో కట్టేసి హింసించిన ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. డీఎస్పీ ఆర్‌.రామాంజి నాయక్‌ పర్యవేక్షణలో చేపట్టిన చర్యల్లో నిందితులను ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.

ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి..

ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామంలో జరిగిన ఈ ఘటనపై చిన్నారి తల్లి కడమంచి గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను గుర్తించిన ఆత్మకూరు అర్బన్‌ సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారయ్యే అవకాశం లేకుండా పక్కా సమాచారంతో గాలింపు చేపట్టారు.

ఇటుకల బట్టీ వద్ద అరెస్టు

పోలీసుల గాలింపు కొనసాగుతుండగా కురుకుంద రోడ్డులోని ఇటుకల బట్టీ సమీపంలో దాక్కున్న ప్రధాన నిందితులు రాజు నాయక్‌ (ఏ1), మల్లు నాయక్‌ (ఏ2)లను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.

మైనర్‌ గుర్తింపు బయటపెట్టొద్దు

బాధితురాలు తొమ్మిదేళ్ల మైనర్‌ కావడంతో ఆమె గుర్తింపు బయటపడేలా వీడియో చిత్రీకరించిన అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లతో పాటు జువైనల్‌ జస్టిస్‌ (జేజే) యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

మైనర్‌ బాలిక ఫొటోలు, వీడియోలు లేదా ఆమె గుర్తింపును వెల్లడించే వివరాలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

డీఎస్పీ రామాంజి నాయక్‌ వెల్లడి

“చిన్నారిపై జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించాం. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం” అని డీఎస్పీ ఆర్‌.రామాంజి నాయక్‌ తెలిపారు.

ఈ చర్యలపై స్థానికులు, ప్రజలు పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో ఆత్మకూరు అర్బన్‌ సీఐ మహేశ్వర్‌ రెడ్డి, రూరల్‌ సీఐ ఎం.సురేష్‌ కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐలు డీవీ.నారాయణరెడ్డి, రఘు రామయ్య గౌడ్‌, కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!