- రాజకీయ జన్మనిచ్చిన నేలపై రేవంత్‌రెడ్డి థ్యాంక్స్ గివింగ్ సభ
- 20 ఏళ్ల ప్రజాప్రస్థానానికి మైలురాయి.. అనుచరులు, ఆనాటి పెద్దలతో ఆత్మీయ కలయిక
హైదరాబాద్, జూలై 4(చైతన్యగళం): తనకు రాజకీయంగా తొలి గుర్తింపు తీసుకొచ్చిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా, తన తొలి విజయానికి పునాది వేసిన నేలపై ‘థ్యాంక్స్ గివింగ్’ సభను నిర్వహిస్తూ ప్రజల ఆశీర్వాదాలకు నమస్కరించేందుకు సిద్ధమయ్యారు.
2006లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ తొలి విజయం ఆయన ప్రజా జీవితానికి బలమైన పునాదిగా నిలిచింది. అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా, తర్వాత కొడంగల్ ఎమ్మెల్యేగా, మల్కాజ్‌గిరి ఎంపీగా, చివరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయనకు ఈ ప్రయాణానికి ఆది మిడ్జిల్ అనే భావన ఇప్పటికీ ఎంతో ఆత్మీయంగా ఉంది.
తన రాజకీయ జీవితానికి అండగా నిలిచిన ప్రజలను, తనను నడిపించిన నాయకులను, తొలి అడుగులో తోడుగా నిలిచిన అనుచరులను ఎప్పటికీ మరచిపోలేనని సీఎం పలుమార్లు సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చదువుకున్న బడి, మొక్కిన దేవాలయం, తనను గెలిపించిన ప్రజలు జీవితాంతం గుండెల్లో నిలిచిపోతారని ఆయన భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని కేవలం రాజకీయ సభగా కాకుండా కృతజ్ఞతా సమర్పణగా నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా “మీ బిడ్డను… మళ్లీ మీ ముందుకు వచ్చాను. మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం లభించింది” అనే భావనతో సీఎం మిడ్జిల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా ముందుగా ఊరుకొండ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడంతో పాటు, తన రాజకీయ ప్రయాణంలో భాగస్వాములైన అనుచరులు, ఆనాటి పెద్దలు, ఆత్మీయులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు. మిడ్జిల్ సమీపంలో లీడర్ గోపాల్‌రెడ్డి, B. R. Ambedkar విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
విద్యార్థి దశ నుంచే ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న రేవంత్‌రెడ్డి, ప్రత్యక్ష రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థిగా అడుగుపెట్టి విజయపథంలో సాగారు. మిడ్జిల్ జడ్పీటీసీగా విజయం సాధించిన తర్వాత మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై, అనంతరం టీడీపీలో చేరి కొడంగల్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్‌గిరి ఎంపీగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ మొత్తం రాజకీయ ప్రస్థానానికి ఆది మిడ్జిల్ అనే భావనతో, తనకు తొలి గెలుపునిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సీఎం చేపట్టిన ఈ కార్యక్రమం ఆయన రాజకీయ జీవితంలో ఒక భావోద్వేగ ఘట్టంగా నిలవనుంది. ప్రజల ఆశీర్వాదమే తనను రాష్ట్ర సేవకు తీసుకొచ్చిందనే సందేశాన్ని ఈ వేదిక ద్వారా మరోసారి వ్యక్తం చేయనున్నారు.
